: ఫేస్‌బుక్ పరిచయంతో దారుణంగా మోసపోయిన 13 ఏళ్ల బాలిక
సోషల్ మీడియా పిల్లల జీవితాలతో ఆడుకుంటోంది. 18 ఏళ్ల వయసు నిండకుండానే ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఓపెన్ చేసి, గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయాలు పెంచుకొని ఘోరంగా మోసపోతున్నారు మైనర్లు. సోషల్ మీడియా ద్వారా అటువంటి మోసాలు జరుగుతాయని కూడా తెలియని మైనర్లు చివరికి జరగాల్సిన నష్టం జరిగిపోయాకగానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయం అయిన ఫ్రెండ్ కోసం ఇళ్లు వదిలేసి మరీ వెళ్లిపోతున్నారు. ఇటువంటి ఘటనే తమిళనాడులో కలకలం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్‌లో ఎనిమిదవ తరగతి చదువుతున్న 13 ఏళ్ల ఓ బాలిక ఎప్పుడూ ఫేస్‌బుక్‌ను వాడుతూ ఉండేది.
ఈ క్రమంలోనే తిరుపూర్‌కు చెందిన 22 ఏళ్ల యువకుడు ఇబ్రహీంతో ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేసేది. అతడు చెప్పే మాయమాటలన్నింటినీ నమ్మేసింది. ఈ క్రమంలో తన ఫోన్ నెంబరు కూడా అతడికి ఇచ్చేసింది. చివరికి ఆ యువకుడు ఆ బాలికను ప్రేమిస్తున్నానని, ఆమె లేనిదే బ్రతకలేనని అన్నాడు. ఆ బాలిక తల్లిదండ్రులు లేని సమయంలో ఒకసారి ఆమె ఇంటికి వచ్చి కలిశాడు. ఇటీవలే మరోసారి మళ్లీ ఆమె ఇంటికి వచ్చి చెన్నై వెళ్లి పెళ్లి చేసుకుని హాయిగా గడుపుదామని, నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలని అన్నాడు. అతడి మాటలకు ఆశపడిపోయిన ఆ మైనర్ బాలిక అతడితో కలసి పారిపోయింది. తమ కూతురు కనిపించకుండా పోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆందోళన చెంది తిరుపూర్ నార్త్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు ఆ బాలికతో చెన్నై చేరుకున్న ఆ యువకుడు అక్కడి నుంచి ఆమెను పాండిచ్చేరి తీసుకెళ్లాడు. అక్కడి కుయిల్‌పాళ్యం ప్రాంతంలో ఓ లాడ్జిలో ఉందామని చెప్పి, బాలికపై అత్యాచారం చేశాడు. ఈ క్రమంలోనే నిందితుడి మొబైల్‌లో ఎంతో మంది మహిళల అభ్యంతరకరమైన ఫోటోలు ఉన్నాయని గుర్తించిన ఆ బాలిక ఆ యువకుడిని నిలదీసింది. దీంతో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఆమెను లాడ్జిలోనే వదిలేసి పారిపోయాడు. కాగా, ఈ విషయం తెలుసుకున్న లాడ్జి మేనేజర్ ప్రభాకరన్ ఆ బాలికతో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అన్నాడు. ఆ బాలిక తన వద్ద డబ్బులు లేవని మెడలోని బంగారు గొలుసు అతడికి ఇచ్చి రూ.5 వేలు తీసుకుంది. అయితే, అతడు కూడా దానిని అలుసుగా తీసుకుని బాలికపై అత్యాచారం చేశాడు. చివరికి ఎట్టకేలకు ఇంటికి చేరుకున్న ఆ బాలిక తల్లిదండ్రులతో కలిసి ఈ ఘటనలపై పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.