: కేజ్రీవాల్ ముందు మూడు డిమాండ్లు పెట్టిన కుమార్ విశ్వాస్
ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్ తమ సొంత పార్టీపైనే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనపై ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ చేసిన వ్యాఖ్యలపై విశ్వాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల ప్రోద్బలంతోనే కుమార్ విశ్వాస్ వ్యవహరిస్తున్నారంటూ ఖాన్ విమర్శించారు. ఈ నేపథ్యంలో విశ్వాస్ మాట్లాడుతూ ఖాన్ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారో తనకు తెలుసని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇదే వ్యాఖ్యలు కేజ్రీవాల్, మనీష్ శిసోడియాలపై చేసుంటే... పది నిమిషాల్లో అతనిపై వేటు పడేదని అన్నారు. తన గురించి అతను ఎన్నోసార్లు దారుణంగా మాట్లాడినా... చిన్న చర్య కూడా తీసుకోలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో కుమార్ విశ్వాస్ ఆమ్ ఆద్మీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారనే వార్తలు వచ్చాయి. అదే జరిగితే పార్టీకి నష్టం వాటిల్లుతుందని భావించిన కేజ్రీవాల్ ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహించి... కుమార్ విశ్వాస్ అసంతృప్తి గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేజ్రీ ముందు కుమార్ విశ్వాస్ మూడు డిమాండ్లు పెట్టారట. అవేంటంటే...
- అవినీతిపై ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు.
- పార్టీ కార్యకర్తలకు అనునిత్యం అందుబాటులో ఉండాలి. వారు చెప్పేది కూడా వినాలి.
- తనపై తీవ్ర విమర్శలు చేసిన అమనతుల్లా ఖాన్ తొలగింపుపై కూడా చర్చ జరగాలి.