: ఇక ఆ గ్రామంలో అమ్మాయిలు ఫోన్ మాట్లాడితే రూ.21 వేల జరిమానా కట్టాల్సిందే!
అమ్మాయిలు సెల్‌ఫోన్ ఉపయోగించకూడదని, ముఖానికి స్కార్ఫ్‌లు కట్టుకోకూడదని ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ మేయర్ శకుంతల భారతి, ఎమ్మెల్యే సంజీవ్ రాజా నిన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. అయితే, అదే రాష్ట్రంలోని మధుర జిల్లాలోని మడోరా గ్రామం అమ్మాయిలు వీధుల్లో నడుస్తూ ఫోన్ మాట్లాడినట్లు కన్పిస్తే వారికి రూ. 21వేల జరిమానా విధిస్తామని నిబంధన విధించడం వివాదం అవుతోంది.
తాజాగా ఆ గ్రామపెద్దలు సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్న సందర్భంగా అందులో ఈ నిబంధనను కూడా చేర్చి అలజడి రేపారు. ఇక ఆవులను చంపినా, మద్యం అమ్మకాలు చేపట్టినా కూడా భారీగా జరిమానా వేయాలని ఆ గ్రామ పంచాయతీ నిర్ణయం తీసుకుంది. గోవధ చేసినా, ఆవులను దొంగతనం చేసినా రూ. 2 లక్షలు, మద్యం అమ్మకాలు చేపడితే రూ. 1.11 లక్షల వరకు జరిమానా విధిస్తామని ప్రకటించింది. ఒక్కోసారి జరిమానాతో పాటు శిక్ష కూడా విధిస్తామని తెలిపింది.