: టీ సర్కార్ కు దమ్ముంటే.. దిగ్విజయ్ వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి: వీహెచ్ సవాల్
తెలంగాణ పోలీసులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. హైదరాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తమ పార్టీ నేత చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. తెలంగాణ ప్రభుత్వానికి దమ్ముంటే, ఈ ఆరోపణలపై విచారణ జరిపించాలని సవాల్ విసిరారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని, బీసీలకు ఆయన విలువ ఇవ్వడం లేదని, జ్యోతిరావ్ పూలే జయంతి నాడు ఆయనకు పూలదండ కూడా వేయలేదని ఆరోపించారు. ఖమ్మం మార్కెట్ యార్డు సంఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూ.. ఇది రైతు ప్రభుత్వం కాదని, దళారుల ప్రభుత్వమని మండిపడ్డారు. మిర్చి రైతుల వద్దకు కేసీఆర్ ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ పదవీకాలం పొడిగింపుపై ఆయన వ్యాఖ్యలు చేశారు. నరసింహన్ గవర్నర్ గా ఉన్నంత కాలం రెండు తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరగదన్నారు. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాస్తానని వీహెచ్ చెప్పారు.