: ఇద్దరు ముఖ్యమంత్రులకు నేను తండ్రిలాంటివాడిని: గవర్నర్ నరసింహన్
ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లకు తాను తండ్రిలాంటివాడినని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విద్య, వైద్యంపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వాలు చేపడుతున్న పథకాల్లో వేగం మరింత పెరగాలని చెప్పారు. ఇరు రాష్ట్రాల మధ్య పంపకాలు జరగాల్సిన అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు. ఇరు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా నరసింహన్ ను ఎన్డీయే ప్రభుత్వం కూడా కొనసాగిస్తున్న సందర్భంగా ఓ మీడియా సంస్థతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సాగు నీటి గొడవను పరిష్కరిస్తానని గవర్నర్ చెప్పారు. రెండు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా అన్ని సమస్యలను సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. వివాదాస్పదంగా మారిన నాగార్జునసాగర్ గొడవను పరిష్కరిస్తానని చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలసి అన్ని సమస్యలను చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తానని తెలిపారు.