: సినిమాలో ‘బాహుబలి’గా కనిపించిన ఆ పసికందు ఓ పాప.. ఎవరి కూతురో తెలుసా?
బాహుబలి-2 సినిమా మేనియా సినీ అభిమానులందరినీ థియేటర్లకు రప్పించుకుంటున్న విషయం తెలిసిందే. బాహుబలిలో నటించిన నటులపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్క పాత్రను దర్శకుడు రాజమౌళి అంతగా తీర్చిదిద్దాడు. కాగా, ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి అంటూ ఇద్దరు పసికందులు కూడా కనిపించారు. అయితే ఈ రెండు పాత్రల్లోనూ కనిపించింది ఒకే శిశువు. ఈ సినిమాలో కనిపించినందుకు ఆ శిశువు కూడా ఇప్పుడు ఫేమస్ అయిపోయింది.
శివగామి రమ్యకృష్ణ ఒడిలో ఆడుకున్న పసికందుగా, ఆమె ప్రాణత్యాగం చేయడంతో బతికిన బాహుబలిగా కనిపించిన ఆ శిశువు ఎవరు? అనే అంశంపై కూడా సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. సిసింద్రీ సినిమాలో నటించిన అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్‌లా.. బాహుబలి సినిమాలో నటించిన ఈ చిన్నారి బాహుబలి కూడా ఎవరయినా స్టార్ కుమారుడేనా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఇందులో ఆ చిన్నారి బాహుబలిగా కనిపించింది అక్షర అనే ఓ పాప. బాహుబలి సినిమా షూటింగ్ కేరళలోని అతురపల్లి జలపాతాల వద్ద జరిగింది. ఆ ప్రాంతంలోని అంగన్‌వాడీ ప్రాంతానికి చెందిన వల్సన్ అనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ బాహుబలి కోసం పనిచేస్తున్న సమయంలోనే అతడికి అప్పుడే ఈ పాప జన్మించింది.
ఆ పాపకు ఆయన అక్షర అని పేరు పెట్టాడు. బాహుబలి సినిమా కోసం అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి ఇద్దరినీ పసికందులుగా చూపించినప్పుడు నిజంగా శిశువుని చూపించకుండా మొదట గ్రాఫిక్స్ చేద్దాం అనుకున్నారట. దర్శకుడు రాజమౌళి మాత్రం బేబీ అక్షరను బాహుబలిగా చూపిద్దాం అని ఫిక్స్ కావడంతో ఆ పాప పుట్టిన కొన్ని రోజులకే బాహుబలిలో కనిపించే అవకాశం కొట్టేసింది. ఈ సినిమాలో నటించే సమయానికి ఆ పాప అక్షర వయస్సు కేవలం 18 రోజులు మాత్రమే.