: 'బాహుబలి-2' సీడీ కావాలా నాయనా... కేవలం రూ. 30 మాత్రమే!
సంచలన విజయం సాధించిన 'బాహుబలి-2' సినిమా పైరసీ కోరల్లో చిక్కుకుంది. 'కోట్లాది రూపాయలు ఖర్చు చేశాం, ఏళ్ల పాటు కష్టించి సినిమాను నిర్మించాం... దయచేసి ఈ సినిమాను పైరసీ చేయకండి', అంటూ దర్శకనిర్మాతలు, నటీనటులు ఎంతగానో వేడుకున్నా పైరసీగాళ్లు పంజా విసిరారు. విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ఈ సినిమా సీడీలు విచ్చలవిడిగా దొరుకుతున్నాయి. టాస్క్ ఫోర్స్ సిబ్బంది పలు సీడీ షాపులపై చేసిన దాడుల్లో భారీ సంఖ్యలో ఈ సినిమా పైరసీ సీడీలు బయటపడ్డాయి.
ఒక్కో సీడీని కేవలం రూ. 30కే అమ్మేస్తున్నారు షాపు నిర్వాహకులు. ఈ సీడీలన్నీ చెన్నై నుంచి వస్తున్నాయని షాపు యజమానులు తెలిపారు. మరోవైపు, టాస్క్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ, పైరసీ సీడీలను అమ్ముతున్న వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ప్రజల్లో మార్పు వస్తే కానీ, ఈ పైరసీ భూతం ఆట కట్టించలేమంటూ ఓ అధికారి అభిప్రాయపడ్డారు.