: మోసూల్ లో అమెరికా దాడి.. భవంతి కూలి వందమంది మృతి.. ఐదు రోజుల తర్వాత బయటపడిన ఒకే ఒక్కడు!
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ఏరివేతకు నడుం బిగించిన అమెరికా.. ఇరాక్‌లోని మోసూల్‌లో ఉన్న ఉగ్రవాదుల స్థావరాలపై భీకర దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల బదులు అమాయక పౌరులు బలవుతున్నారు. ఇటీవల పశ్చిమ మోసూల్‌లో అమెరికా జరిపిన వైమానిక దాడిలో ఓ భవంతి నేల మట్టమైంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్న రెస్క్యూ సిబ్బందికి ఓ వ్యక్తి కొన ఊపిరితో కనిపించాడు.
అలీ జనౌన్ అనే అతడు ఐదు రోజులపాటు శిథిలాల కింద నరకయాతన అనుభవించాడు. రెస్క్యూ సిబ్బంది వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించింది. కాగా, అమెరికా వాయుసేన దాడులకు భయపడిన వందమంది ఈ భవనంలోనే దాక్కున్నారు. అమెరికా బాంబుదాడిలో అది నేలమట్టమైంది. దీంతో అందులో తలదాచుకున్న వారిలో అందరూ మరణించగా అలీ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఇతనికి ఇరాక్‌లోని ఇర్బిల్‌లో చికిత్స అందిస్తున్నారు.