: ఇక కలయిక హుళక్కే.. కత్తులు దూస్తున్న పన్నీర్, పళని!


అయిపోయింది.. అంతా అయిపోయింది. వైరి వర్గాలుగా విడిపోయిన అన్నాడీఎంకే ఇక ఒక్కటి కావడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది. కలయిక ఇక కలలో మాటే అని రెండు వర్గాలు చెబుతున్నాయి. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. విలీనానికి సిద్ధమంటూనే శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి తప్పించడం వంటి ఆంక్షలు పెట్టిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్  సెల్వం కలయిక అసాధ్యమన్న నిర్ణయానికి దాదాపు వచ్చేశారు. దీంతో ఆయన రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే లోక్ సభ డిప్యూటీ స్పీకర్ మంగళవారం చేసిన వ్యాఖ్యలు విలీనంపై మళ్లీ ఆశలు రేకెత్తిస్తున్నాయి. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి బహిష్కరించేందుకు ఉన్న మార్గాలను సూచించాల్సిందిగా ఆయన పన్నీర్ వర్గాలను కోరడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

మరోవైపు అన్నాడీఎంకే (అమ్మ) పార్టీ అసంతృప్త ఎమ్మెల్యేలు ఈనెల 5న కరూరులో నిరాహార దీక్షకు సిద్ధం కాగా, విలీన ప్రయత్నాలు బెడిసికొట్టడంతో పన్నీర్ వర్గానికి చెందిన 11 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి పళనివైపు చూస్తున్నారు. కాగా, తాము నిబంధనలు లేని చర్చలకు సిద్ధమని ముఖ్యమంత్రి చెబుతుండగా, విలీనంపై ఈపీఎస్ నాటకమాడుతున్నారని పన్నీర్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక మంత్రులు సెంగొట్టయ్యన్, దిండుగల్లు శ్రీనివాసన్, ఆర్‌ వైద్యలింగం, పార్టీ అధికార ప్రతినిధి నాంజిల్‌ సంపత్‌, మాజీ మంత్రి వలర్మతి సైతం పన్నీర్‌ తీరును తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. దీంతో కలయిక ఇక ఉత్తమాటే అని తేలిపోయింది.

  • Loading...

More Telugu News