: ఈ-మెయిల్ అడ్రెస్ లో ఒక్క అక్షరం మార్చాడు.. కోటిన్నర తన ఖాతాలో వేసుకున్నాడు!
ఒకే ఒక్క అక్షరం తేడాతో ఈ-మెయిల్ పంపి ఏకంగా రూ.1.67 కోట్లను కొట్టేశాడో ఘరానా మోసగాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. డిసెంబరు 2013లో ఆర్కేఆర్ గోల్డ్ రూ.1.67 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను సింగపూర్‌కు చెందిన వాల్యూమిక్స్ ప్రీసియస్ మెటల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎగుమతి చేసింది. Jk.rkrgold@gmail.com ఈ-మెయిల్‌తో ఆ సంస్థతో టచ్‌లో ఉంటూ చెన్నైలోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని తమ ఖాతాకు చెల్లించాల్సిన మొత్తాన్ని పంపాలని అందులో కోరింది. ఇంతవరకు బాగానే ఉన్నా Jk.rkrgolds@gmail.com ఈ-మెయిల్‌తో వాల్యూమిక్స్కు మరో మెయిల్ వెళ్లింది. తమకు చెల్లించాల్సిన రూ.1.67 కోట్లను హెచ్ఎస్బీసీ ఖాతాలో జమచేయాల్సిందిగా అందులో ఉంది. దీంతో అందులోని ఖాతా నంబరుకు ఆ మొత్తాన్ని వాల్యూమిక్స్ ట్రాన్స్ఫర్ చేసింది. అయితే మరో ఆరు రోజుల తర్వాత ఆర్కేఆర్ గోల్డ్ నుంచి మరో ఈ-మెయిల్ వచ్చింది. తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని పేర్కొనడంతో మోసం బయటపడింది.
ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సింగపూర్‌కు చెందిన గ్రేస్ టాన్ అనే మోసగాడు ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. Jk.rkrgold@gmail.com ఈ-మెయిల్‌కు ‘ఎస్’ అనే అక్షరాన్ని చేర్చి Jk.rkrgolds@gmail.com పేరుతో మెయిల్ పంపి ఈ మోసానికి పాల్పడినట్టు గుర్తించారు. దొంగ ఈ-మెయిల్‌ను గుర్తించకపోవడం వల్లే ఈ ఘోరం జరిగినట్టు చెబుతున్నారు. వ్యవహారం సీబీఐకి చేరడంతో అతడిపై కేసు నమోదు చేసింది.