: 1690 ఎకరాల్లో 15 ఏళ్లలో మూడు దశల్లో పనులు.. కేబినేట్ భేటీ అనంతరం కీలక వివరాలు వెల్లడించిన చంద్రబాబు
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు కీలక విషయాలు వెల్లడించారు. ఏపీ రాజధానికి 1690 ఎకరాల్లో 15 ఏళ్లలో మూడు దశల్లో పనులు చేస్తామని వివరించారు. ఈ పనుల్లో సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం వాటా ఉంటుందని అన్నారు. మరో 42 శాతం వాటా ఏడీసీకి ఉంటుందని చెప్పారు. భూమి అంశం ఎల్లప్పుడూ సీఆర్‌డీఏ వద్దే ఉంటుందని చెప్పారు. ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. సింగపూర్ కన్సార్టియం రూ.2,118 కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్పారు.
ప్రస్తుతం ఏపీలో ఆదాయం లేదని, అయినప్పటికీ అధైర్యపడవద్దని తాను ముందు నుంచే చెబుతూ వస్తున్నానని అన్నారు. అన్ని అంశాలను పరిశీలించుకొని, తెలివిగా ముందుకు వెళ్లాలని తాను సూచిస్తున్నట్లు చెప్పారు. రాజధాని అనగానే వెంటనే కట్టేసేది కాదని తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచీ చెబుతున్నానని అన్నారు. అమరావతి ఒక ఆర్థిక నగరంగా తెలుగుజాతి గర్వపడేలా తయారు కావాలని ఆయన అన్నారు. అందుకే ఎన్నో అంశాలను పరిశీలిస్తున్నామని, రాజధానిలో ఆరోగ్య నగరి, విద్యా నగరిలను ఏర్పాటు చేస్తామని అన్నారు. సానుకూలంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తామని అన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని ఒక్కో మెట్టు తీర్చిదిద్దడానికి ప్రణాళిక వేశామని అన్నారు.