: ద్రవ్యోల్బణం ప్రభావం రైతులపై కూడా ఉంటుందని చంద్రబాబుకి తెలియదా?: జగన్ విమర్శలు
వచ్చీ రాని ఇంగ్లిష్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు మాటలు మాట్లాడుతున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అన్నారు. ‘ఆయన ఏం మాట్లాడుతున్నారో తెలుసా? ఇన్‌ఫ్లేషన్ అంటూ రేట్లు పెరిగిపోతున్నాయంటూ మాట్లాడుతున్నారు. ద్రవ్యోల్బణం అంటారు. ఖర్చులు పెరిగాయని, నిర్మాణ వ్యయం పెరిగిందంటారు. పోలవరం నిర్మాణ వ్యయం పెరిగిందంటారు. అయితే, మరి రైతులకు అందించే రుణం పెంచరా?.. రైతులకు అందించే సాయం పెంచరా? ఎస్టీ, ఎస్సీ విద్యార్థులకు మెస్ ఛార్జీలు పెంచడంలో మాత్రం ద్రవ్యోల్బణం కనబడదా? ఎక్కడ చంద్రబాబు నాయుడికి లాభం వస్తుందో అక్కడే ఆయనకు ద్రవ్యోల్బణం కనబడుతుంది.
మిర్చి రైతుల నుంచి పంటను మార్క్‌ఫెడ్ ద్వారా ఎందుకు కొనలేదు? ప్రభుత్వం పంటను కొనుగోలు చేస్తే వ్యాపారుల్లో పోటీపెరిగి మంచి రేటు వచ్చేది. రూ.1500 పథకం వల్ల వ్యాపారులే లబ్ధి పొందుతున్నారు. ఓ వైపు ద్రవ్యోల్బణం పెరిగిందంటూ రాజధాని నిర్మాణాల కాంట్రాక్టర్లకు రేట్లు పెంచామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. రైతులపై కూడా ద్రవ్యోల్బణం ప్రభావం ఉంటుందని చంద్రబాబు నాయుడికి తెలియదా?’ అని జగన్ విమర్శించారు.