: టీడీపీని నందమూరి వంశానికి ఇచ్చి.. చంద్రబాబు సొంత పార్టీ పెడితే, డిపాజిట్లు కూడా రావు: కొడాలి నాని
దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన దొంగ ముఖ్యమంత్రి చంద్రబాబు కళ్లు తెరిపించేందుకే తమ అధినేత జగన్ రైతు దీక్ష చేపట్టారని ఆ పార్టీ నేత కొడాలి నాని అన్నారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడుతున్నారని... అయినా చంద్రబాబు మొద్దు నిద్రపోతున్నారని అన్నారు. దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే జగన్ దీక్షకు పూనుకున్నారని తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 5వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జగన్ దీక్షతోనైనా చంద్రబాబు కళ్లు తెరిచి, రైతులకు మేలు చేయాలని కోరారు.
జగన్ గురించి అవాకులు, చవాకులు పేలితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని నాని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి, తెలంగాణ సీఎంకు భయపడిపోయి, పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. మామకు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు ఆక్రమించుకున్నారని... కానీ, కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టుకున్న నేత జగన్ అని తెలిపారు. టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, చంద్రబాబు సొంత పార్టీ పెడితే కనీసం డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వ్యక్తిని మంత్రిని చేశారని పరోక్షంగా లోకేశ్ ని ఉద్దేశించి విమర్శించారు.