: నేతల్లో నిర్లక్ష్యం, ఇష్టానుసారం మాట్లాడటం పెరిగిపోయాయి!: చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
తెలుగుదేశం పార్టీ నేతలు పలువురిలో ఇష్టానుసారం మాట్లాడటం, నిర్లక్ష్యం పెరిగిపోయాయని, క్రమశిక్షణా రాహిత్యాన్ని ఎంతమాత్రమూ సహించేది లేదని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. ఈ ఉదయం నుంచి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం ముగియగా, అగ్రనేతల నుంచి కింది స్థాయి నేతల వరకూ ఎంతో మంది నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
చేసింది చెప్పలేకనే కింది స్థాయిలోనూ నిర్లక్ష్యం పెరిగిపోయిందని అభిప్రాయపడ్డ చంద్రబాబు, గతంలో ఏ పార్టీ ఇవ్వనన్ని నామినేటెడ్ పోస్టులను భర్తీ చేశామని, పదవులను పొందిన వారు కూడా ఇష్టమొచ్చిన రీతిలో మాట్లాడుతూ, పార్టీకి నష్టం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు ఆక్షేపించినట్టు సమాచారం. ఇకపై ఇలాంటి ప్రవర్తనలను, వాటిని ప్రోత్సహించే వారిని సహించేది లేదని హెచ్చరిస్తూనే, పదవులు రానివారి కోసం త్వరలో మరిన్ని నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్టు వెల్లడించారు. మార్కెట్ కమిటీలు, ఆలయ కమిటీలు, సాగునీటి సంఘాల్లో ఖాళీలను భర్తీ చేస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.