: రిలయన్స్ తిరుగులేని ఆధిపత్యం... బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లలో 40 శాతం జియోవే: ట్రాయ్
మార్కెట్లోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే రిలయన్స్ జియో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. టెలికాం రెగ్యులేటర్ ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ఇండియాలో బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందిస్తున్న అతిపెద్ద సంస్థగా జియో నిలిచింది. కనీసం 512 కేబీపీఎస్ వేగంతో నెట్ సేవలందిస్తుంటే దాన్ని బ్రాడ్ బ్యాండ్ గా పరిగణిస్తుండగా, ఈ సేవలను అందుకుంటున్న వారి సంఖ్య జనవరితో పోలిస్తే 25.37 కోట్ల నుంచి 2.98 శాతం పెరిగి 26.13 కోట్లకు చేరిందని, ఈ మొత్తం వినియోగదారుల్లో 10.28 కోట్ల మంది (39.36 శాతం) జియో కస్టమర్లని ట్రాయ్ వెల్లడించింది.
ఇక రెండో అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్ సేవల సంస్థగా ఉన్న ఎయిర్ టెల్ 4.46 కోట్ల మంది కస్టమర్లతో 17.87 శాతం వాటాతో ఉందని తెలిపింది. ఆ తరువాత 3.20 కోట్ల మందికి సేవలందిస్తూ, 12.27 శాతం మార్కెట్ వాటాతో వోడాఫోన్, 2.43 కోట్ల మంది కస్టమర్లతో 9.3 శాతం వాటాతో ఐడియా సెల్యులార్ నిలిచాయని వెల్లడించింది. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్ కు 2.08 కోట్ల మంది కస్టమర్లుండగా, మార్కెట్ వాటా 7.69 శాతమని పేర్కొంది.
ఇతర మొబైల్ సేవల సంస్థలన్నింటికీ కలిపి 3.46 కోట్ల మంది కస్టమర్లు (13.24 శాతం) ఉన్నారని వెల్లడించింది. మొబైల్ బ్రాడ్ బ్యాండ్ల విషయంలోనూ రిలయన్స్ జియో ఆధిపత్యం కొనసాగింది. ఆ సంస్థకు 10.28 కోట్ల మంది కస్టమర్లుండగా, ఎయిర్ టెల్ 4.46 కోట్లు, వోడాఫోన్ 3.20 కోట్లు, ఐడియా 2.43 కోట్ల మంది కస్టమర్లతో తొలి నాలుగు స్థానాలను పంచుకున్నాయని ట్రాయ్ ఓ ప్రకటనలో పేర్కొంది. వైర్ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సేవల్లో మాత్రం బీఎస్ఎన్ఎల్ అగ్రస్థానంలో నిలిచి సుమారు కోటి మందికి సేవలందిస్తోందని వెల్లడించింది.