: చేతులెత్తేసిన ఈసీ... అనంతనాగ్ ఉప ఎన్నిక రద్దు
కాశ్మీరు లోయలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని చేతులెత్తేస్తూ, అనంతనాగ్ లోక్ సభ ఉప ఎన్నికను మరోసారి రద్దు చేస్తున్నట్టు ఈసీ ప్రకటించింది. ఈ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని భావిస్తున్నామని, ప్రజలు భయం లేకుండా ఓట్లు వేయాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎలక్షన్ కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. వాస్తవానికి ఈ నెల 25న ఎన్నిక జరగాల్సి వుండగా, తదుపరి నోటీసులు ఇచ్చే వరకూ ఎన్నికలు జరగబోవని తెలిపింది.
అంతకుముందు ఏప్రిల్ 12న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైన ఈసీ మొదటిసారి ఎన్నికను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు పూర్తి భద్రత కల్పించేంత భద్రతా దళాలు లేకపోవడం కూడా ఎన్నికల రద్దుకు కారణమని పేర్కొంది. ఈ మేరకు 10 పేజీలున్న ఆర్డర్ ను జారీ చేస్తూ, తిరిగి ఎన్నికను ఎప్పుడు జరిపించేది తదుపరి ప్రకటిస్తామని వెల్లడించింది. కాగా, జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితిపై ఆ రాష్ట్ర గవర్నర్ నరీందర్ నాథ్ వోహ్రా నేడు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలవనున్నారు.