: హహహ... జగన్ దీక్షా.... ఆ సినిమాలోలా సాయంత్రం లోటస్ పాండ్ లో కూర్చుంటాడా?: ఆనం వివేకా ఎద్దేవా
జగన్ దీక్షపై నెల్లూరు టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి పగలబడి నవ్వారు. 'రాష్ట్రమనే పచ్చని చెట్టుకు పట్టిన చీడపురుగు జగన్' అని అన్నారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్ దీక్ష చూస్తే... తనకు 'ఒంగోలు గిత్త' సినిమా గుర్తొస్తుందని అన్నారు. ఆ సినిమాలో మిర్చియార్డు ఛైర్మన్ గా ప్రకాశ్ రాజ్ నటించాడని... ఉదయాన్నే పూటుగా తయారై ప్రజల ముందుకు వస్తాడని... ప్రజల బాధలు వింటాడు, కన్నీరు పెడతాడు..సాయంత్రం ఇంటికెళ్లి గుడ్డలిప్పి కూర్చుని మందుకొడతాడని అన్నారు... అలా జగన్ దీక్ష ముగిసిన తర్వాత లోటస్ పాండ్ లో కూర్చుంటాడా? అని ఆయన ఎద్దేవా చేశారు.
నెల్లూరులో టీడీపీ అభ్యర్థి ఎవరైనా సరే గెలిపిస్తామని చంద్రబాబుకు చెప్పామని అన్నారు. తమకు ఎవరిపైనా చాడీలు చెప్పే అలవాటు లేదని అన్నారు. అలాగే తమకు పనులు కావడం లేదన్న ఆక్రోశమూ లేదని చెప్పారు. తమకు ఉన్న అవసరాలన్నీ తమ నియోజకవర్గంలోని ప్రజల్లో ఒకరికి పెన్షన్ ఇప్పించడం, మరొకరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించడం తప్ప ఇంక పనులేమీ ఉండవని చెప్పారు. అలాగే ఆ పనులతో పాటు తాము టీడీపీలో చేరిన సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చమన్నామని ఆయన తెలిపారు. తమ గురించి ముఖ్యమంత్రికి కొత్తగా చెప్పాల్సిందేమీ లేదని, గత 30 ఏళ్లుగా తామేంటో ఆయనకు తెలుసని అన్నారు.
బాబు విద్యార్థి దశ నుంచి ఆయనతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని వివేక చెప్పారు. తాము చంద్రబాబును చూసే పార్టీలో చేరామని, తమను, తమ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు చాలా చక్కగా తెలుసని అన్నారు. గతంలో రామారావు గారు రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి మున్సిపల్ ఛైర్మన్ ఇస్తానని చెప్పి, గొంతు కోశారని... అందుకే పార్టీ వదిలామని ఆయన వెల్లడించారు. తమకేం కావాలో చంద్రబాబును ప్రత్యేకంగా అడగాల్సిన అవసరం లేదని, తమ లక్ష్యం ఆయనకు తెలుసని, పార్టీకి తామెలా ఉపయోగపడతామో కూడా వారికి తెలుసని ఆయన చెప్పారు. చంద్రబాబు తమకు మేలే చేస్తారని ఆయన తెలిపారు.