: వలలో పడే అమ్మాయిల్లో టెక్కీలే అధికం: స్పష్టం చేసిన హైదరాబాద్ షీ టీమ్స్

కామాంధుల వలలో చిక్కుకుని, ప్రేమ పేరిట ఘోరంగా మోసపోతున్న వారిలో ఐటీ కంపెనీల్లో పనిచేసే అమ్మాయిలే అధికంగా ఉన్నారని హైదరాబాద్ షీ టీమ్స్ వెల్లడించాయి. సహోద్యోగినులకు ఉన్నతాధికారులు, ఐటీ ఉద్యోగినులకు బడా వ్యాపారవేత్తలు వల వేస్తున్నారని, వారి మాయమాటలను నమ్మి ఆకర్షణలో పడి సర్వస్వమూ అర్పించుకుని ఆపై విలపిస్తున్నారని పోలీసు అధికారులు వెల్లడించారు. ఒక్క ఏప్రిల్ నెలలోనే 86 మంది షీ టీమ్స్ ను ఆశ్రయించగా, వీరిలో సగానికి పైగా ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న వారే ఉండటం గమనార్హం.

ఈ 86 ఫిర్యాదుల్లో 22 కేసులు నమోదు చేసి 12 మందిని జైలుకు పంపామని, వీరిలో అత్యధికులు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారని తెలిపారు. 4 అత్యాచార కేసులు, 15 లైంగిక వేధింపుల కేసులు, మిగిలిన వారిపై పెట్టీ కేసులు పెట్టామని, 15 మందికి కౌన్సెలింగ్ ఇప్పించామని షీ టీమ్స్ ఇన్ చార్జ్ సలీమా వెల్లడించారు. హైదరాబాద్ లో 350కి పైగా సాఫ్ట్ వేర్ సంస్థలు ఉండటం, దాదాపు లక్ష మందికి పైగా అమ్మాయిలు పలు రాష్ట్రాల నుంచి వచ్చి పని చేస్తుండటంతో, వారి భద్రత నిమిత్తం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని, ఎప్పటికప్పుడు ఆకతాయిల ఆటలు కట్టిస్తున్నామని ఆమె తెలిపారు.

More Telugu News