: యాపిల్ కంపెనీని హెలికాప్టర్ లో పక్కరాష్ట్రం వాళ్లు తీసుకెళ్లిపోయారు: నాయిని ఆసక్తికర వ్యాఖ్యలు
ఐటీలో తెలంగాణ రాష్ట్రాన్ని మంత్రి కేటీఆర్ నంబర్ వన్ గా నిలిపారని తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రశంసించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అన్ని రంగాల్లో సమానంగా ఎదిగేందుకు పక్క రాష్ట్రం పోటీ పడుతోందని అన్నారు. నిజానికి యాపిల్ కంపెనీ తెలంగాణలోనే ఏర్పాటు కావాల్సి ఉందని, అయితే యాపిల్ కంపెనీని ప్రత్యేక హెలికాప్టర్లో విజయవాడకు తీసుకెళ్లిపోయారని ఆయన చమత్కరించారు. అందుకే మనం మరింత స్ట్రాంగ్ గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.
కాంట్రాక్టు కార్మికుల కనీస వేతనాల పెంపు ప్రకటన ఈపాటికే జారీ చేయాల్సి ఉందని చెప్పిన ఆయన, కొన్ని కారణాల వల్ల జాప్యం జరుగుతోందని అన్నారు. కేవలం వారికే కాకుండా అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం కూడా ఆలోచిస్తున్నామని, రెండు లేక మూడు రోజుల్లో వారికోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.