: నేను నా వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నాను...సాక్ష్యం ఇదిగో!: కేటీఆర్ కు రిటార్ట్ ఇచ్చిన దిగ్విజయ్ సింగ్
ట్విట్టర్ వేదికగా తెలంగాణ పోలీసులు, కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జీ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ పోలీసులు ఐఎస్ఐఎస్ కు సంబంధించిన ఫేక్ వెబ్ సైట్ ను రూపొందించారని ఆయన అన్నారు. ఆ సైట్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగానే.... తెలంగాణ పోలీసులు ఇచ్చిన సమాచారంతో ఉత్తరప్రదేశ్ లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాది సైఫుల్లాఖాన్ ఎన్ కౌంటర్ జరిగిందని ఆయన వెల్లడించారు.
ముస్లిం యువకుల ద్వారానే ఐఎస్ఐఎస్ కు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ పోలీసులు సేకరించారని ఆయన చెప్పారు. 'అంతెందుకు, నా వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ ఖండించారు కానీ... తెలంగాణ పోలీసులు ఖండించలేదు కదా?' అని ఆయన గుర్తు చేశారు. ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలని ఆయన అన్నారు. కాగా, తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన దిగ్విజయ్ సింగ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేయగా, డిగ్గీ రాజాను హైదరాబాదులో అడుగుపెట్టనీయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హెచ్చరించిన సంగతి తెలిసిందే.