: నా వ్యాఖ్యల్లో దురుద్దేశం లేదు.. చంద్రబాబుకు వివరణ ఇచ్చిన చిత్తూరు ఎంపీ.. మ్యాటర్ క్లోజ్!
అంబేద్కర్ జయంతి సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలపై చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చారు. శివప్రసాద్ వ్యాఖ్యలపై అప్పట్లో చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఇది క్రమశిక్షణ చర్యల వరకు వెళ్లింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా సోమవారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ఎంపీ చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యల్లో దురుద్దేశం ఏమాత్రం లేదని, దళితుల మనోభావాలను అర్థం చేసుకోవాలనే తాను అన్నానని పేర్కొన్నారు. వారిని మరింత దగ్గరకు తీసుకోవాలనే అలా మాట్లాడాను తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు.
ఎంపీ వివరణ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలి కానీ బహిరంగ సభలో మాట్లాడడం, మీడియా ముందుకు వెళ్లడం సరికాదంటూ ఎంపీని గట్టిగా ప్రశ్నించినట్టు తెలిసింది. ‘‘మీ వ్యవహార శైలిని గమనిస్తున్నా. ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నారు కానీ పార్టీ కార్యక్రమాలకు రావడం లేదు. ఇలా చేయడం వల్ల ప్రజలకు, ప్రతిపక్షాలకు తప్పుడు సంకేతాలు వెళతాయి’’ అని చంద్రబాబు కాస్త గట్టిగానే హెచ్చరించినట్టు తెలిసింది. గంటపాటు జరిగిన వీరి సమావేశంలో ఎట్టకేలకు కథ సుఖాంతమైనట్టు పార్టీ నేతలు చెబుతున్నారు.