: నేను బ్లాక్ మెయిల్ చేయడమేంటి? నాన్సెన్స్... ఆయన నాపై చాలా సార్లు అత్యాచారం చేశాడు: గుజరాత్ ఎంపీపై మహిళ ఆరోపణలు
మత్తుమందు తాగించి అభ్యంతరకర రీతిలో ఫోటోలు తీసి 5 కోట్లు కావాలని వేధిస్తోందంటూ గుజరాత్ లోని వల్సాద్ ఎంపీ కేసీ పటేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఆయన కేసు పెట్టిన మహిళ స్పందించింది. తాను ఎంపీ అధికారిక నివాసానికి మార్చి 3వ తేదీన వెళ్లానని, ఆ సందర్భంగా ఆయనను భోజనానికి ఆహ్వానించానని ఆమె తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ ఎంపీపై కేసుపెట్టింది.
ఈ సందర్భంగా ఎంపీ పటేల్ తనను పలు మార్లు అత్యాచారం చేశాడని, అందుకు వీడియో సాక్ష్యం కూడా ఉందని ఆమె ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఆమె నివాసాన్ని గుర్తించిన పోలీసులు దాడులు చేయగా, ఆమె పరారీలో వుందని తేలింది. కాగా, ఆమె నెలరోజుల క్రితం హర్యానాకు చెందిన మరో ఎంపీపై అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు పెట్టిందని, అనంతరం ఆ కేసును విత్ డ్రా చేసుకుందని ఢిల్లీ ప్రత్యేక పోలీసు కమిషనర్ ముఖేష్ మీనా వెల్లడించారు. అయితే ఆ కేసును ఆమె ఎందుకు ఉపసంహరించుకుందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఆమెది బ్లాక్ మెయిల్ కేసు అని భావించి, ఆమె చేసిన అత్యాచారం ఆరోపణల కేసును నమోదు చేయలేదని ఆయన తెలిపారు. ఆమె ఫోన్ కాల్స్ పై నిఘా పెట్టామని ఆయన తెలిపారు.