: వివాహం జరిగిన మూడు గంటల్లోనే విడాకులు.. వెంటనే మరో యువకుడితో వధువుకు మళ్లీ పెళ్లి!


ఓ యువ‌కుడిని పెళ్లి చేసుకున్న‌ మూడు గంటల్లోనే అత‌డికి విడాకులు ఇచ్చేసి ఓ యువ‌తి మ‌రొక‌రిని పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న జార్ఖండ్‌లోని ఛాంద్వా గ్రామంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళితే... పెళ్లి కట్నం కింద ద్విచ‌క్ర వాహ‌నం ఇస్తామ‌ని ముందుగా పెళ్లి కూతురి త‌ల్లిదండ్రులు ఏమీ చెప్ప‌లేదు. అయిన‌ప్ప‌టికీ పెళ్లయిన వెంటనే త‌న‌కు బైక్ కావాలంటూ పెళ్లికొడుకు అన్సారీ గొంతమ్మ కోరిక‌ కోరాడు. లేదంటే పెళ్లి కూతురును త‌న‌ ఇంటికి తీసుకెళ్లేదిలేద‌ని అన్నాడు. దీంతో పెళ్లి కూతురు తండ్రి బషీర్ వెంట‌నే మార్కెట్‌కు వెళ్లి హీరో హోండా ఫ్యాషన్‌ బైక్‌ను కొనుగోలుచేసి తీసుకొచ్చి అల్లుడికి ఇచ్చాడు. అయితే, పెళ్లి కొడుకు ఆ బైక్ తీసుకొని సంతోష ప‌డ‌క‌, త‌న‌కు అంతకంటే ఖరీదైన బైక్‌ కావాలని మ‌ళ్లీ డిమాండ్ చేశాడు. దానితో స‌రిపెట్టుకోమ‌ని పెద్దలు ఎంత‌ చెప్పినా వినిపించుకోలేదు.

దీంతో తనకు ఈ భర్త వద్దని పెళ్లి కూతురు తెగేసి చెప్పింది. ఇప్పుడే ఇలా చేస్తే భ‌విష్య‌త్తులో ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడోన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. దీంతో పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు ముస్లిం పెళ్లి పెద్ద ‘కాజా’కు కబురు పెట్టారు. అనంత‌రం పెళ్లి కొడుకు మెడ‌లో చెప్పుల దండ వేశారు. కట్నం కోసం కక్కుర్తిపడ్డాను అని ఓ బోర్డును అత‌డి మెడ‌లో త‌గిలించారు. గుండు గీయించి ఇంటికి పంపారు. పెళ్లి కొడుకు వైపున నిల‌బ‌డి, త‌న అన్న‌కు స‌పోర్టుగా మాట్లాడిన వ‌రుడి త‌మ్ముడికి  కూడా సగం గుండు గీయించారు. మ‌త పెద్ద‌ కాజా వచ్చి రుబానా మొదటి పెళ్లిని రద్దు చేశారు. అనంత‌రం అదే ఊరికి చెందిన మొహమ్మద్‌ ఇలియాస్‌ అనే యువకుడి తల్లిదండ్రులతో మాట్లాడిన పెద్ద‌లు అదే పెళ్లి పందిట్లో ఆ వ‌ధువుకు పెళ్లి చేశారు.

  • Loading...

More Telugu News