: చంద్రబాబు ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమే: ధర్మాన ప్రసాదరావు
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఎప్పుడూ రైతులకు వ్యతిరేకమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. గుంటూరులో జగన్ తలపెట్టిన ‘రైతు దీక్ష’ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలప్పుడు తాను మారానని చంద్రబాబు చెప్పారని, టీడీపీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చినా రైతులను పట్టించుకోదని అన్నారు. ముఖ్యమైన ప్రాజెక్టులను పక్కన పెట్టి కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారని మండిపడ్డారు. దివంగత నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు ‘పోలవరం’ అని, దానికి జాతీయ హోదా కూడా వచ్చిందని .. అటువంటి ప్రాజెక్టు పనులను కూడా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే జగన్ ఈ దీక్ష చేపట్టారని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని, వైఎస్ఆర్సీపీని గెలిపిస్తేనే రైతులకు మేలు జరుగుతుందన్నారు. కష్టాలు ఎదురైనా రైతులు అధైర్యపడవద్దని .. వైఎస్ జగన్ రైతుల వెంట ఉంటారని ధర్మాన అన్నారు.