: ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు.. మనకు కనిపించింది, వినిపించింది కూడా ఇదే!: బాబుపై జగన్ విమర్శలు
ఎన్నికల ముందు ఎన్నో హామీలు గుప్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలు, రైతులతో పని అయిపోయిందన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలన మొదలై మూడేళ్లయిపోయిందని, అయినప్పటికీ రైతులకు న్యాయం చేయలేకపోతున్నారని ఆయన విరుచుకుపడ్డారు. కనీస మద్దతుధర ఇవ్వకుండా వరికి 50, 60 రూపాయల చొప్పున ముష్టివేసినట్లు ఇస్తున్నప్పటికీ, చంద్రబాబు నోట్లోంచి ఒక్క మాట కూడా రాదని ఆయన అన్నారు.
రైతులకు తోడుగా ఉంటానని, కుటుంబ పెద్దగా నిలబడతానని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు వారి గురించి పట్టించుకోవడం లేదని జగన్ అన్నారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం తిరిగి రావాలంటే, బాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల ముందు బాగా ప్రచారం చేసుకన్నారని జగన్ అన్నారు. రైతు రుణాలన్నీ బేషరతుగా మాఫీ కావాలంటే బాబు రావాలని టీవీల్లోనూ పబ్లిసిటీ చేసుకున్నారని ఆయన విమర్శించారు. ఇంటికి వెళ్లి టీవీ ఆన్ చేస్తే చాలు.. మనకు కనిపించింది, వినిపించింది కూడా ఇదేనని జగన్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు 2500-4000కు మిర్చి రేటు పడిపోయిందని, చంద్రబాబు ఆదుకోవడం లేదని ఆయన మండిపడ్డారు.