: బాహుబలి-2 కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ఆరెకటిక సంఘాల భారీ ఆందోళన.. రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిక
బాహుబలి-2 సినిమాను మరో వివాదం చుట్టుముడుతోంది. ఈ రోజు హైదరాబాద్లోని ప్రాంతీయ సెన్సార్ బోర్డు ఆఫీసు ఎదుట ఆరెకటిక సంఘాలు భారీ ధర్నాకు దిగాయి. ఈ సినిమాలో తమ కులాన్ని కించపరిచేలా పలు సీన్లు ఉన్నాయని, వాటిని తొలగించాలని వారు డిమాండ్ చేస్తుండడంతో అలజడి రేగుతోంది. బాహుబలి-2లో తమ కులాన్ని కించపరిచే విధంగా ‘కటిక చీకటి’ అనే పదం ఉందని, అది ఆరె కటికల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని వారు అంటున్నారు. సెన్సార్ బోర్డు కూడా ఈ పదానికి అనుమతినివ్వడమేంటని వారు నీలదీస్తున్నారు.
ఈ సినిమా దర్శక, నిర్మాతలపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కూడా నిన్న వారు నగరంలోని బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సినిమా నుంచి ‘కటిక చీకటి’ పదాన్ని వెంటనే తొలగించకుంటే రాజమౌళి ఇంటిని ముట్టడిస్తామని వారు ఈ రోజు హెచ్చరించారు. అయినప్పటికీ ఆ పదాన్ని తొలగించకపోతే సినిమా థియేటర్ల వద్ద ఆందోళన ఉద్ధృతం చేస్తామని అన్నారు.