: ప్రపంచం నాశనమవుతుందేమో!: పోప్ ఫ్రాన్సిస్ ఆందోళన
ప్రపంచం నాశనమవుతుందేమోనని పోప్ ఫ్రాన్సిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికా, ఉత్తరకొరియా దేశాల మధ్య చోటుచేసుకుంటున్న ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు ప్రపంచ వినాశనానికి దారితీసే ప్రమాదం పొంచి ఉందని పోప్ ఫ్రాన్సిస్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరిగితే ప్రపంచం అంతం కాక తప్పదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం కేవలం వాటికి మాత్రమే పరిమితం కాదని, ఈ యుద్ధం ఫలితాన్ని ప్రపంచ దేశాలు కూడా అనుభవించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు నార్వే లాంటి దేశాలు నడుం బిగించాలని ఆయన సూచించారు. ఏవైనా రెండు దేశాల మధ్య రాజకీయ యుద్ధం, ప్రపంచ నాశనానికి కారణం కాకూడదని ఆయన పేర్కొన్నారు. మానవాళి వినాశనం అనేది అత్యంత ఘోరమైన చర్య అని ఆయన తెలిపారు. ఒకవేళ ఈ రెండు దేశాల మధ్య యుద్ధం అనివార్యమైతే భవిష్యత్ పరిణామాలను ఊహించడం కూడా కష్టంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.