: అందానికి 100 ఆపరేషన్లు చేయించుకుంది....మరొకటి చేయించుకుంటుండగా ప్రాణాలు కోల్పోయింది!
అందం కోసం 100 సర్జరీలు చేయించుకున్న సోషల్ మీడియా స్టార్ క్రిస్టినా మార్టెల్లీ 101వ సర్జరీ సమయంలో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. క్యుబెక్ లో పుట్టిపెరిగిన క్రిస్టినా మార్టెల్లీ 17 ఏళ్ల వయసు నుంచే అందంగా, మరింత ఆకర్షణీయంగా కనిపించేందుకు సర్జరీలు చేయించుకోవడం మొదలు పెట్టింది. అలా ఇప్పటి వరకు ఆమె సుమారు 100 సర్జరీలు చేయించుకుంది. ఆకర్షించేందుకు ఉపయోగపడే ప్రతి భాగాన్ని ఆమె సర్జరీలతో తీర్చిదిద్దుకుంది. గత నెల 18న 101వ సర్జరీకి సిద్ధమవుతున్న సమయంలో ఆమె గుండెపోటుకు గురై మరణించినట్టు తెలుస్తోంది.
ఆమె బట్స్ (పిరుదుల) కు శస్త్రచికిత్స చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురైందని, దీంతోనే ఆమె మరణించిందని కథనాలు వెలువడుతున్నాయి. మోడల్ గా ఆకట్టుకున్న ఆమెకు సుమారు 6 లక్షల మంది వరకు ఫాలోవర్లు ఉన్నారు. తన సర్జరీల వెనుక ఒకటే కారణమని, తన శరీరాన్ని ఎప్పటికప్పుడు మరింత అందంగా చూసుకోవడం తనకు ఇష్టమని తెలిపింది. ఆమె మరణించినట్టు ఆమె స్నేహితురాలు ఏప్రిల్ 21న నిర్ధారించడంతో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో ఆమె అభిమానులు నిరాశ చెందారు.