: మల్టీ నేషనల్ కంపెనీలను ఊడ్చేస్తాం: బాబా రాందేవ్
ఇండియాలో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకుంటున్న మల్టీ నేషనల్ కంపెనీలను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోలుస్తూ, ఈ సంస్థలన్నీ భారతీయులను లూటీ చేస్తున్నాయని, వచ్చే ఐదేళ్లలో అన్నింటినీ ఇండియా నుంచి తరిమేస్తామని యోగా గురు బాబా రాందేవ్ ధీమాగా అన్నారు. పతంజలి సంస్థ అందిస్తున్న ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని, విక్రయాలు పెరుగుతున్నాయని గుర్తు చేసిన ఆయన, భారతావనిని ఎంఎన్సీ రహిత దేశంగా మార్చి చూపుతామని అన్నారు. ఆ సంస్థలేవీ దేశాభివృద్ధికి దోహదపడటం లేదని, ఇక్కడి ప్రజలను దోచుకుని, డబ్బులను సంపాదించుకోవడమే వాటి లక్ష్యమని అన్నారు.
"వచ్చే ఐదేళ్లలో పతంజలి సంస్థ ఎంఎన్సీ సంస్థలకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది" అని యోగి భరత్ భూషణ్ జయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన సభలో ప్రసంగించిన ఆయన వ్యాఖ్యానించారు. అధునాతన సాంకేతిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా ఉత్పత్తిని పెంచడంపై రైతుల్లో తాము అవగాహన పెంచుతామని తెలిపారు. వారి పంటకు మంచి ధరను కూడా అందిస్తామని పతంజలి వ్యవస్థాపకుడిగా ఉన్న రాందేవ్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రజలతో మమేకమవుతున్నారని, తన పాలనలో అభివృద్ధి దిశగా సాగుతున్నారని కితాబిచ్చారు.