: నాడు, నేడు వెన్నుపోటుకు వెనకడుగు వేయనిది చంద్రబాబే: జగన్ నిప్పులు
నమ్మిన వారిని వెన్నుపోటు పొడవడంలో చంద్రబాబు ఎన్నడూ వెనకడుగన్నదే వేయడని వైకాపా అధినేత వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం గుంటూరులో కార్మికులను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఆనాడు అధికారం కోసం పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, నేడు నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని చెప్పిన ఆయన, ఇప్పుడా ఊసే ఎత్తడం లేదని అన్నారు.
రాష్ట్రంలోని అన్ని వర్గాలూ బాబు పాలనపై అసంతృప్తితో ఉన్నాయని, రైతులు, కార్మికులు, నాయకులు, ఉద్యోగులు, విద్యార్థులు, డ్వాక్రా కార్మికులు ఎవరూ సంతోషంగా లేరని తెలిపారు. ప్రతి ప్రభుత్వ సంస్థనూ ప్రైవేటు పరం చేసేందుకు చంద్రబాబు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన కుయుక్తులను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. రేషనలైజేషన్ పేరిట స్కూళ్లు, కాలేజీలను మూసివేస్తున్నారని ఆరోపించిన జగన్, బాబు పాలనా విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తాను చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల ప్రజలూ మద్దతు పలకాలని కోరారు.