: కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య వాగ్వాదం... ఖమ్మం మార్కెట్ యార్డులో ఉద్రిక్తత
ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డు కేంద్రం మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. మిర్చి రైతులకు గిట్టుబాట ధర కల్పించడం లేదని ఆరోపిస్తూ రైతులు ఇటీవల మార్కెట్ యార్డ్ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు నేడు ఖమ్మం జిల్లా మార్కెట్ యార్డును సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు, వ్యాపారులతో సమావేశమయ్యారు.
రైతు సమస్యలు అడిగి తెలుసుకున్న జానారెడ్డి, భట్టి విక్రమార్క, వీహెచ్ తదితరులు వ్యాపారులతో మాట్లాడుతూ...రైతుల కష్టాన్ని దోచుకుంటున్న మీరు వ్యాపారస్తులా? టీఆర్ఎస్ నేతలా? అంటూ వ్యాఖ్యానించారు. దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ నేతలు కల్పించుకుని కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇది తీవ్రస్థాయి దాల్చడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పి వివాదం తగ్గించే ప్రయత్నం చేశారు.