: చేజేతులా చేసిన తప్పులే మా కొంపముంచాయి: గంభీర్
హైదరాబాద్ వేదికగా, గత రాత్రి జరిగిన మ్యాచ్ లో తాము చేజేతులా చేసిన తప్పులే తమను ఓటమి ముందు నిలిచేలా చేశాయని కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ విశ్లేషించాడు. 48 పరుగుల తేడాతో తాము ఓడిపోవడం వెనుక కీలక సమయాల్లో క్యాచ్ డ్రాప్ లు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డాడు. డేవిడ్ వార్నర్ ఇచ్చిన క్యాచ్ లను పట్టుకోవడంలో ఆటగాళ్లు వైఫల్యం చెందారని, ఇది తాము భారీ మూల్యాన్ని చెల్లించేలా చేసిందని అన్నాడు. పదో ఓవర్ లో వార్నర్ క్యాచ్ ని క్రిస్ వోక్స్ జారవిడిచాడని గుర్తు చేశారు.
తమ ఆటగాళ్లు ఫీల్డింగ్ ను మరింతగా మెరుగు పరచుకోవాల్సి వుందని అన్నాడు. మరింత ఏకాగ్రతతో ఫీల్డింగ్ చేయాలని సూచించాడు. బౌలర్లు కూడా నాణ్యమైన బంతులు వేయాలని సూచించాడు. తనకు వచ్చిన లైఫ్ లతో వార్నర్ చెలరేగిపోయి ఆడాడని తెలిపాడు. కాగా, ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కోల్ కతా జట్టు టాప్ పొజిషన్లో ఉండగా, మరో నాలుగు మ్యాచ్ లు ఆడాల్సి వుంది. వాటిల్లో ఏ ఒక్కటి గెలిచినా, ప్లే ఆఫ్ కు అవకాశాలు ఉంటాయి. రెండు మ్యాచ్ లు గెలిస్తే, ఆ జట్టు కచ్చితంగా ప్లే ఆఫ్ కు చేరుకుంటుంది. ముంబై ఇండియన్స్ కు అవకాశాలు కూడా ఇదే విధంగా ఉండగా, మూడు, నాలుగు స్థానాల్లో సన్ రైజర్స్, రైజింగ్ పుణె జెయింట్స్ ఉన్నాయి.