: ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలతో ప్రజలకు ఊరట... మరో రెండు రోజులు వర్షాలు
హైదరాబాద్, విజయవాడ సహా తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం ఒక్కసారిగా తగ్గింది. మొన్నటి వరకూ 43 డిగ్రీల వరకూ ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 38 నుంచి 39 డిగ్రీలకు తగ్గాయి. పలు ప్రాంతాల్లో చిరు జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న హైదరాబాద్ తో పాటు కడప, కర్నూలు, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఐపీఎల్ మ్యాచ్ కి సైతం వరుణుడు కాసేపు అంతరాయం కలిగించాడు. ఇక వచ్చే రెండు రోజులు కూడా ఇదే తరహాలో వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. తెలంగాణలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి నాగరత్నం పేర్కొన్నారు.