: కాంగ్రెస్ నేతలు రచ్చ చేయడం కోసమే సభకు వచ్చారు: హరీష్ రావు
భూ సేకరణ చట్ట సవరణలకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ బిల్లుపై ఇంతకుముందే చర్చ జరిగిందని, ఈ సవరణలపై చర్చకు బీఏసీలో నిర్ణయం జరిగిందని, కానీ, కాంగ్రెస్ నేతలు అనవసర రాద్ధాంతం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ సవరణలపై చర్చ చేసేందుకు కాకుండా రచ్చ చేసేందుకే వచ్చారని, చర్చ చేయకుండా మార్షల్స్ పై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. రైతు ప్రయోజనాలను కాంగ్రెస్ పట్టించుకోలేదని, ప్రాజెక్టులను అడ్డుకునేందుకు రైతులను రెచ్చగొడుతున్నారని, ప్రాజెక్టుల భూ సేకరణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ 38 కేసులు వేసిందని, ఈ చట్టం అమలైతే కాంగ్రెస్ వేసిన కేసులు నిలబడవని హరీష్ రావు అన్నారు.