: ‘బాహుబలి’పై గుణశేఖర్ ప్రశంసలు...నెటిజన్ల విమర్శలు
‘బాహుబలి-2’పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రశంసలు కురిపించినా..నెటిజన్లు మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. ‘బాహుబలి-2’లో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందంటూ గుణశేఖర్ స్వయంగా ఓ లేఖ రాశారు. ఈ లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సినిమా అనేది ఎంత బలమైన విజువల్ మీడియానో మరోమారు నిరూపించిన దర్శకుడి రాజమౌళికి తన శుభాకాంక్షలు అని ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే, ఓ మామూలు కథను అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో గొప్పగా చిత్రీకరించినందుకు ‘హాట్సాఫ్’ అని పేర్కొన్నారు. అయితే, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందించిన కథ, ఆయన సృష్టించిన పాత్రల వల్లే ఇంతటి విజయం సాధ్యమైందని ‘బాహుబలి’ యూనిట్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ‘మామూలు కథ’ అని గుణశేఖర్ అనడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.