: పరీక్షల్లో సమాధానాలుగా పాటలు, బూతులు రాసిన లా కాలేజీ విద్యార్థులు... రెండేళ్ల పాటు సస్పెన్షన్
సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న వేళ, డిగ్రీ విద్యార్థుల సమాధాన పత్రాల్లో పాటలు, బూతులు, కవితలు, ప్రేమ గురించిన అంశాలను చూసి నివ్వెరపోయిన వాల్యుయేషన్ సిబ్బంది, విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో, పది మంది విద్యార్థులపై రెండేళ్ల సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని మల్దాలో ఉన్న బల్గన్ ఘాట్ లా కాలేజీలో జరిగింది. వీరి సమాధాన పత్రాలను పరిశీలించిన నిజ నిర్థారణ కమిటీ, జవాబు పత్రాల్లో హిందీ, బెంగాలీ సినిమా పాటలు, ప్రేమ లేఖలు, దూషణలు ఉన్నాయని తేల్చగా, విద్యార్థుల తీరుపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు బెంగాల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (అడిషనల్ చార్జ్) సనాతన్ దాస్ తెలిపారు.
గత సంవత్సరం 150 మంది పరీక్షలు రాస్తే, కేవలం 40 మంది పాస్ అయ్యారని, తమను కావాలనే పాస్ చేయించలేదని ఆరోపిస్తూ, కళాశాలలో హింసాత్మక ఘటనలకు విద్యార్థులు పాల్పడ్డారని ఆయన గుర్తు చేశారు. జవాబులు తప్పుగా రాయడమే కాకుండా, అభ్యంతరకరంగా వ్యవహరించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.