: జమ్ముకశ్మీర్‌లో విషాదం.. ఆర్మీ కాల్పుల్లో ఆర్మీ పోర్టర్ మృతి.. వారి కుటుంబ సభ్యులందరూ దేశ సేవలోనే!


జమ్ముకశ్మీర్‌లో విషాదం చోటు చేసుకుంది. మూడు దశాబ్దాల పాటు భారత ఆర్మీలో పోర్టర్‌గా సేవలందించిన మహమ్మద్ యూసుఫ్ భట్ (70) దురదృష్టవశాత్తు ఆర్మీ జరిపిన కాల్పుల్లో మృతి చెందాడు. ఇటీవల కుప్వారాలో జరిగిన ఉగ్రదాడిలో కెప్టెన్ సహా ముగ్గురు జవాన్లు మృతి చెందారు. ఆర్మీ ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు.  వీరి మృతదేహాలను అప్పగించేందుకు ఆర్మీ నిరాకరించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఉగ్రవాదుల మద్దతుదారులు ఆర్మీపై రాళ్లు రువ్వారు. వారిని అదుపు చేసేందుకు సైన్యం కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో దురదృష్టవశాత్తు మహమ్మద్ యూసుఫ్ మృతి చెందాడు. విషయం తెలిసిన సైన్యం విషాదంలో కూరుకుపోయింది.

సేవలందించిన ఆర్మీ చేతిలోనే యూసుఫ్ మృతి చెందిన విషయం తెలిసిన ఆయన భార్య రేష్మా బేగం కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘మా బావమరిది ఆర్మీలో ఉన్నారు. ఆయన కుమారుడు కూడా ఆర్మీలోనే చేస్తున్నాడు. నా కొడుకు కూడా ఆర్మీలోనే ఉన్నాడు. నా భర్త 30 ఏళ్లుగా ఆర్మీలో పోర్టర్ గా చేస్తున్నారు. మాకే ఎందుకిలా అయింది?’’ అని బేగం రోదించారు.

ఆందోళనకారుల్లో భట్ లేరని, మందులు తీసుకొచ్చేందుకు వెళ్తుండగా బులెట్ తగిలి ఆయన కుప్పకూలినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. భట్ పెద్దకుమారుడు తారిఖ్ అహ్మద్ ఆర్మీలో ఇప్పటికి 15 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. ప్రస్తుతం అసోంలో ఉన్నాడు. తారిఖ్ చదువుకు కల్నల్ అధికారి ఒకరు సాయం చేసినట్టు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కాగా, భట్ చావుకు కారణమైన ఆందోళనపై దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.


  • Loading...

More Telugu News