: ధోనీ లేకుంటే ఇండియాకు చాలా కష్టం: రికీ పాంటింగ్
ఇంగ్లండ్ లో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సేవలెంతో అవసరమని, అతన్ని తప్పించాలని భావిస్తే అది పెద్ద పొరపాటు అవుతుందని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ లో టాప్ ఆర్డర్ వికెట్లు త్వరగా కుప్పకూలే ప్రమాదం అధికమని, ఆ సమయంలో మిడిల్ ఆర్డర్ లో ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతలను ధోనీ సమర్థవంతంగా మోయగలడని చెప్పాడు.
ధోనీ లేకుంటే ఇండియా కష్టాలనుభవించాల్సి వస్తుందని తెలిపాడు. ఐపీఎల్ పోటీలు 20 ఓవర్లకే పరిమితం కాబట్టి, కుదురుకునేందుకు సమయం లభించక, ధోనీ ఆశించిన రీతిలో ఆడలేకపోతున్నాడని, వన్డే పోటీల్లో సమయం ఉంటుంది కాబట్టి ధోనీ చక్కగా రాణించగలడని పాంటింగ్ చెప్పాడు. పుణె జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి ధోనీని తొలగించిన వేళ తనకెంతో ఆశ్చర్యం కలిగిందని అన్నాడు.