: త్వరలో అన్ని పార్టీలతో ఈసీ సమావేశం.. వచ్చే ఎన్నికల్లో వీవీపాట్ యంత్రాల వినియోగం


ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లు ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదని, పూర్తి భద్రతతో కూడుకున్నవని చెప్పేందుకు త్వరలో అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నసీం జైదీ తెలిపారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వోటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రైల్ (వీవీపాట్) యంత్రాలను ఉపయోగించాలని యోచిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల విధానంలో మరింత పారదర్శకంగా వ్యవహరించి ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు వీవీపాట్ యంత్రాలను ఉపయోగించాలనుకుంటున్నట్టు తెలిపారు.

ఈవీఎంలలో లోపాలున్నాయని, ట్యాంపరింగ్ జరుగుతున్నాయంటూ 16 ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో తిరిగి బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో స్పందించిన జైదీ మాట్లాడుతూ ఈవీఎంల విషయంలో చేస్తున్న ఆరోపణలు అర్థం లేనివని కొట్టిపడేశారు. ఆరోపణలు నిరూపించాలని ఈసీ చేసిన ఓపెన్ చాలెంజ్‌ను గుర్తు చేశారు. కాగా, వీవీపాట్ యంత్రాల కొనుగోలుకు సరిపడా నిధులు సేకరించామని, 15 లక్షల వీవీపాట్ యంత్రాల కోసం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ)కి ఆర్డర్ కూడా ఇచ్చినట్టు జైదీ తెలిపారు.

  • Loading...

More Telugu News