: 'వినాశకాలే విపరీత బుద్ధి'... భారీ స్థూలకాయురాలికి డాక్టర్ తీవ్ర హెచ్చరిక
దాదాపు 500 కిలోలకు పైగా బరువుతో ఉండి, చికిత్స కోసం ప్రత్యేక విమానంలో ముంబైకి వచ్చి కోలుకుంటున్న ఈజిప్ట్ మహిళ ఇమాన్ అహ్మద్ ను తిరిగి ఇక్కడి నుంచి తరలించాలని భావించడం అత్యంత ప్రమాదకరమని ఆమెకు వైద్యం చేస్తున్న బేరియాట్రిక్ సర్జన్ ముఫజ్ లాల్ లక్డావాలా హెచ్చరించారు.
"ఇమాన్ ను యూఏఈకి తీసుకు వెళ్లాలని ఆమె కుటుంబం భావించడం మంచిది కాదు. వినాశకాలే విపరీత బుద్ధి. ఆమె సోదరి షైమా సెలీమ్ ఎవరి ప్రోద్బలంతోనో మాపై ఆరోపణలు చేస్తోంది" అని అన్నారు. తన తొలి మీడియా సమావేశంలోనే ఇమాన్ ను తిరిగి నడిచేలా చేసి చూపిస్తానని చెప్పానని, ఎవరూ చేయలేని విధంగా ఆమెను మార్చానని అన్నారు. మంచంపై ఉంచి తీసుకువచ్చిన ఆమెను, కుర్చీలో కూర్చోబెట్టుకుని తీసుకెళ్లే స్థాయికి తెచ్చానని అన్నారు. కాగా, ఆమెను అబూదాబిలోని ఓ ఆసుపత్రికి తరలించనున్నట్టు షైమా వెల్లడించిన సంగతి తెలిసిందే. తన సోదరికి ఇండియాలో సరైన చికిత్స జరగడం లేదని, బరువు తగ్గిందని డాక్టర్లు అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించింది కూడా.