: వణికిపోతున్న తమిళ మంత్రులు... 20 మంది అజ్ఞాతంలోకి!
ఈసీకి లంచం ఇవ్వజూపిన దినకరన్ కేసులో భాగంగా, డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై పోలీసులు ఒక్కో ఆధారాన్నీ సేకరిస్తుండగా, రెండాకుల గుర్తు కోసం దినకరన్ కు డబ్బులు ఇచ్చిన తమిళ మంత్రులు ఇప్పుడు వణికిపోతున్నారు. లంచం ఇవ్వజూపిన డబ్బును మంత్రులే సమకూర్చినట్టు దినకరన్ ను విచారించిన తర్వాత తెలుసుకున్న పోలీసులు, రూ. 10 కోట్ల నగదును ఎవరు ఇచ్చారు? ఎలా తరలించారు? అన్న విషయాలను రాబట్టారు. మిగతా డబ్బు ఎలా వచ్చిందన్న విషయమై విచారణ సాగుతుండగా, ఏ రోజు ఎవరి పేరును బయటకు తెచ్చి ఇబ్బందులు పెడతారోనన్న ఆందోళన మంత్రుల్లో వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే 20 మంది మంత్రులు చెన్నై నగరాన్ని వీడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎక్కడ కేసు తమ మెడకు చుట్టుకుంటుందోనన్న భయం వీరిలో నెలకొని ఉందని తెలుస్తోంది. కేసు విచారణలో భాగంగా రూ. 50 కోట్లను ఎలా సేకరించారన్న విషయంపైనే ఢిల్లీ పోలీసులు ప్రధానంగా దృష్టిని సారించినట్టు సమాచారం. ఇక దినకరన్, సుకేష్, నరేష్ లను విచారించిన పోలీసులు, ఆపై దినకరన్ ను మూడు రోజుల పాటు చెన్నై తీసుకువచ్చి కూడా విచారించిన సంగతి తెలిసిందే. కేసులో తగిన ఆధారాలు సేకరించిన ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అధికారులు, త్వరలోనే మంత్రులకూ సమన్లు జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.