: ఉత్తమ్ కుమార్ మూర్ఖుడా? లేక నాయకుడా?: తుమ్మల ఘాటు వ్యాఖ్యలు
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మూర్ఖుడా? లేక నాయకుడా? అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూర్ఖుడైతేనే భూసేకరణకు తొందరెందుకని అంటారని ఎద్దేవా చేశారు. భూసేకరణకు తొందర ఉండబట్టే ఆదివారమైనా అసెంబ్లీ పెడుతున్నామని చెప్పారు. ఏ సమయంలో ఏ సమస్యలపై ప్రశ్నించాలన్న కనీస జ్ఞానం కూడా కాంగ్రెస్ నేతలకు లేదని అన్నారు.
రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నంత మద్దతు ధరను గతంలో ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా? అని ప్రశ్నించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో పని చేస్తున్నారని చెప్పారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయలాంటి వారికి వ్యవసాయంపై అవగాహన లేదని అన్నారు. మిర్చి ధరలకు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదని దత్తాత్రేయ అంటున్నారని... మరి ఇతర పంటలకు మద్దతు ధరలు ప్రకటిస్తోంది కేంద్ర ప్రభుత్వామా? లేక పాకిస్థాన్ ప్రభుత్వమా? అని మంత్రి తుమ్మల ఎద్దేవా చేశారు.