: రోడ్డు ప్రమాదంలో నటి, మోడల్ సోనికా చౌహాన్ మృతి.. యువ నటుడికి గాయాలు
ప్రముఖ మోడల్, నటి, యాంకర్ సోనికా చౌహాన్ ఘోర రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయింది. ఈ ఘటనలో ఆమె స్నేహితుడు, బెంగాలీ యువ నటుడు బిక్రమ్ ఛటోపాధ్యాయ తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే, వీరిద్దరూ కలసి కోల్ కతాలో కారులో వెళుతుండగా ప్రమాదానికి గురయ్యారు. అదుపు తప్పి డివైడర్ కు ఢీకొన్న కారు... ఆ తర్వాత పేవ్ మెంట్ మీదకు ఎక్కేసింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారిని హుటాహుటీన ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే సోనికా చౌహాన్ మరణించిందని వైద్యులు వెల్లడించారు. తలకు తీవ్ర గాయమైన ఆమె స్నేహితుడు బిక్రమ్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగినప్పుడు బిక్రమ్ చాలా వేగంగా కారును నడుపుతున్నట్టు సమాచారం. ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమయింది. ప్రమాదం జరిగినప్పుడు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కాలేదని తెలుస్తోంది. సోనికా మృతి పట్ల బెంగాలీ సినీరంగానికి చెందిన పలువురు సంతాపం తెలిపారు. బిక్రమ్ పలు బెంగాలీ సినిమాల్లో నటించాడు.