: దావూద్ ఇబ్రహీం చనిపోయాడా?...అనుచరులు ఎదురు తిరగకుండా విషయాన్ని దాచిపెడుతున్నారా?


బొంబాయి పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం చనిపోయాడా? అంటే పరిస్థితులు అవుననే చెబుతున్నప్పటికీ...ఆయన అనుచరులు అవన్నీ పుకార్లు అంటూ కొట్టిపడేస్తున్నారు. అయితే నేర సామ్రాజ్యాన్ని ఏకతాటిపై నడిపేందుకు దావూద్ అనుచరులు ఈ డ్రామా ఆడుతున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 1955 డిసెంబర్ 27న దావూద్ ఇబ్రహీం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో జన్మించాడు. కాల క్రమంలో తల్లితో కలిసి ముంబైలోని డోంగ్రీ ఏరియాలో ప్రాధమిక విద్యనభ్యసించాడు. హైస్కూల్ రోజుల్లోనే చదువు మానేశాడు. తరువాత హాజీమస్తాన్ తో సంబంధాలు దావూద్ ను తిరుగులేని గ్యాంగ్ స్టర్ గా మార్చాయి.

 నేరసామ్రాజ్యాన్ని అంచెలంచెలుగా పెంచుకుంటూ మాఫియా డాన్ గా ఎదిగాడు. బాగా డబ్బు సంపాదించడంతో పాటు చేసిన నేరాలు కూడా దావూద్ ను ప్రత్యేకమైన మనిషిగా చేశాయి. దీనిని క్యాష్ చేసుకున్న దావూద్ ఇబ్రహీం పౌరుల భయాన్నే వ్యాపారం చేసుకున్నాడు. గాడ్ ఫాదర్ తరహాలో పటిష్ఠమైన నెట్ వర్క్ తో ముంబైలోని వివిధ ప్రాంతాల్లో తన హవాను చాటుకున్నాడు. 1993 బొంబాయి పేలుళ్ల తరువాత పాకిస్థాన్ పారిపోయాడు. భారత్ లో నేరసామ్రాజ్యంలో సంపాదించిన డబ్బుతో పాకిస్థాన్ లో విలాసవంతమైన జీవితం అనుభవించాడు. భారత్ లో జరిగిన నకిలీ నోట్ల వ్యాపారంలో సింహభాగం పాకిస్థాన్ దే అయితే, అందులో అధిక భాగం దావూద్ ఇబ్రహీందేనని ఇంటెలిజెన్స్ నిపుణులు చెబుతారు.

బాలీవుడ్ తో విశేషమైన సంబంధాలు నెరపడం ద్వారా పాగా వేశాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ ను వీడలేదు. పలు సినిమాలకు తన అనుచరులతో ఫైనాన్స్ చేస్తాడని పుకార్లు ఉన్నాయి. 60 ఏళ్లు పైబడిన దావూద్ ను వయసు సంబంధిత సమస్యలతో పాటు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా వేధిస్తున్నాయి. 20 రోజుల క్రితం పక్షవాతం రావడంతో కుడివైపు భాగం చచ్చుబడిపోయిందని, పాకిస్థాన్ లోని హస్తవాసిగల స్టార్ వైద్యులు చికిత్స చేసినా రక్షించలేకపోయారని తెలుస్తోంది. ఒసామాబిన్ లాడెన్, లష్కరే తోయిబా, ఆల్ ఖైదా, తాలిబాన్ ఉగ్రవాద సంస్థలతో దావూద్ ఇబ్రహీంకు సంబంధాలు ఉండడం విశేషం.

దావూద్ ఇబ్రహీం చనిపోయాడని ప్రకటిస్తే...అతని నేరసామ్రాజ్యం మొత్తం కూకటి వేళ్లతో పెకిలించబడుతుంది. అతని అనుచరులే తిరగబడి అతని ఆస్తులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకునేందుకే... దావూద్ ఇబ్రహీం బతికి ఉన్నాడని అతని అనుచరులు ప్రచారం చేస్తున్నారు. అంతే కాకుండా డీగ్యాంగ్ నుంచి ఫైనాన్స్ పొందిన సంస్థలు కూడా తిరగబడే అవకాశం ఉంది. దీంతో దావూద్ ఇబ్రహీం చనిపోలేదని, ఆరోగ్యంగా ఉన్నాడని ప్రచారం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి.

  • Loading...

More Telugu News