: రచయిత, నటుడిగా కూడా విద్యాసాగర్ రావు పాప్యులరే!
తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, సాగునీటి రంగ నిపుణులు విద్యాసాగర్ రావు కేన్సర్ మహమ్మారితో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. 1960లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజినీరింగ్ పట్టా పుచ్చుకున్న ఆయన... తొలినాళ్లలో జూనియర్ ఇంజినీర్ గా విధులు నిర్వహించారు. 1979లో రూర్కీలోని జలవనరుల అభివృద్ధి వర్శిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఆ తర్వాత 1983లో అమెరికాలోని కొలరాడో యూనివర్శిటీ నుంచి డిప్లొమా సాధించారు. అంతేకాదు, ఢిల్లీ యూనివర్శిటీ నుంచి న్యాయ శాస్త్రంలో కూడా పట్టా పొందారు.
కేంద్ర జల సంఘంలో వివిధ హోదాల్లో పని చేసిన విద్యాసాగర్ రావు... ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమానికి కూడా సలహాదారుగా వ్యవహరించారు. కేంద్రంలో రైల్వే, నీటిపారుదల శాఖల్లో ఇంజినీరుగా సేవలందించారు. చిన్నప్పటి నుంచి ఆటలన్నా, పాటలన్నా, రాతలన్నా విద్యాసాగర్ రావుకు చాలా ఇష్టం. ఆ మమకారంతోనే విద్యార్థి దశలో ఆయన పలు నాటకాలు వేశారు. ఉద్యోగంలో చేరిన తర్వాత కూడా నాటకాలు వేయడం, రాయడం ఆయన ఆపలేదు. హైదరాబాదులో ఉన్నప్పుడు రవీంద్రభారతికి వెళ్లడం ఆయనకు ఓ హాబీ.