: తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, జలయోధుడు విద్యాసాగర్ రావు కన్నుమూత
తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు, ప్రముఖ సాగునీటి రంగ నిపుణుడు, మాజీ చీఫ్ ఇంజినీర్ ఆర్.విద్యాసాగర్ రావు తుదిశ్వాస విడిచారు. ఎక్స్ టెన్సివ్ మెటస్టాటిక్ బ్లాడర్ కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం 11.23 గంటలకు కన్నుమూశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆయన గత కొంతకాలంగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో కొన్ని రోజులుగా ఆయనను వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో సైతం చురుకుగా పాల్గొన్న ఆయన... ముఖ్యమంత్రి కేసీఆర్ కు సన్నిహితులు. ఇటీవలే ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్... విద్యాసాగర్ రావును పరామర్శించారు.
గత రెండేళ్లుగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న విద్యాసాగర్ రావు... ఏడాది క్రితం అమెరికాకు వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నెల 22న ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చి... కీమోథెరపీ అందించారు. అయినప్పటికీ ఫలితం దక్కలేదు.