: రాజ్ నాథ్ సింగ్ జీ...మీకందరికీ రక్షణ మేమే...మరి మాకు రక్షణ ఏది?: సీఆర్పీఎఫ్ జవాన్ పంకజ్ మిశ్రా నిలదీత


కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ పై సీఆర్పీఎఫ్ జవాన్ పంకజ్ మిశ్రా సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో మాట్లాడుతూ, కేంద్ర మంత్రులు, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, ఇలా అధికారంలో ఉన్న ప్రతిఒక్కరికీ ఎక్స్, వై, జడ్ కేటగిరీల పేరుతో రక్షణ కల్పించేది తామేనన్న సంగతి మరువొద్దని సూచించారు. ప్రముఖులకు రక్షణ కల్పించే తమ ప్రాణాలకు మాత్రం రక్షణ లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే తమపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. కశ్మీర్ లో ఉగ్రవాదుల వల్ల అయినా, ఛత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో మావోయిస్టుల వల్ల అయినా ముప్పు ఉందంటే అది ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల కాదా? అని అడిగాడు. అంతే కాకుండా రాజ్ నాథ్ సింగ్ కేంద్ర హోం మంత్రి అయ్యాకే తమపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు.

తాము బీజేపీని చూసి ఓట్లు వేయలేదని, ప్రధాని నరేంద్ర మోదీని చూసి ఓట్లు వేశామని ఆయన తెలిపారు. మోదీని అతి కొద్దిమంది మీలాంటి వారు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వాస్తవాలు మోదీకి తెలిస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘించడమే అవుతుందని వారు తెలిపారు. సుక్మా జిల్లాలో మరణించిన సీఆర్పీఎఫ్ జవాను సోదరుడు కావడం వల్లే పంకజ్ మిశ్రా తీవ్రంగా స్పందించాడని వారు పేర్కొంటున్నారు. అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని వారు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News