: చీఫ్ జస్టిస్ సహా ఏడుగురు సుప్రీం న్యాయమూర్తులు విదేశాలకు వెళ్లకుండా జస్టిస్ కర్ణన్ నిషేధం!


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ సహా ఏడుగురు న్యాయమూర్తులు విమానాలు ఎక్కి విదేశాలకు వెళ్లకుండా చూడాలంటూ ఎయిర్ కంట్రోల్ అథారిటీకి వివాదాస్పద కోల్ కతా హైకోర్టు జడ్జి సీఎస్ కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. వాళ్లపై ఉన్న కేసులు తేలేవరకు ఈ నిషేధాన్ని అమలు చేయాలని ఆదేశించారు. కోల్‌ కతా న్యూటౌన్‌ లోని రోజ్‌ డేల్ టవర్స్‌ లో గల తన ఇంట్లో స్వయంగా ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కోర్టు నుంచి ఆయన ఈ ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఈ న్యాయమూర్తులపై కేసు నమోదు చేయాలంటూ ఏప్రిల్ 13న కర్ణన్ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

వీరంతా ఈ 28న తన ఇంట్లోని కోర్టు ఎదుట హాజరు కావాలని సమన్లు కూడా పంపారు. ఇక తన ఆదేశాలను పాటించలేదని ఆరోపిస్తూ, సీజేఐ జేఎస్ ఖేఖర్, న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగోయ్, మదన్ బి లోకూర్, పినాకి చంద్రఘోష్‌, కురియన్ జోసెఫ్‌లపై విదేశీ ప్రయాణ నిషేధాన్ని విధించారు. కాగా, కర్ణన్ పై కోర్టు ధిక్కార ఆరోపణలు రాగా తమ ముందు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించగా, ఆయన పక్కనబెట్టారు. సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల హైకోర్టులలో పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన 20 మంది న్యాయమూర్తులపై కర్ణన్ అవినీతి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News