: దావూద్ ఇబ్రహీం నిక్షేపంగా వున్నాడు!: కరాచీ నుంచి ఫోన్ లో చోటా షకీల్
మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆరోగ్యం క్షీణించి రోజులు లెక్కబెట్టుకుంటున్నాడని, పక్షవాతంతో ఉన్న ఆయనకు, హార్ట్ ఎటాక్ వచ్చిందని పలు మీడియా సంస్థలు కథనాలను ప్రసారం చేస్తున్న వేళ, ఆయన ప్రధాన అనుచరుడు చోటా షకీల్ స్పందించాడు. దావూద్ పై వస్తున్న వార్తలన్నీ అసత్యాలేనని, ఆయన క్షేమంగా ఉన్నాడని ప్రస్తుతం కరాచీలోనే ఉన్న చోటా షకీల్, 'టైమ్స్ ఆఫ్ ఇండియా'కు ఫోన్ చేసి చెప్పాడు.
"నేను చెప్పేది వినండి. అటువంటిదేమీ జరగలేదు. ఆయనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే. భాయ్ నిక్షేపంగా ఉన్నాడు" అని వెల్లడించాడు. కాగా, కరాచీలోని ఆగా ఖాన్ హాస్పిటల్ లో దావూద్ చికిత్స పొందుతున్నాడని, ఆ సమయంలో గుండెపోటు రావడంతో ఆరోగ్యం మరింతగా క్షీణించిందని, ఆయన మరణించి ఉండవచ్చని కూడా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.