: టికెట్‌తో పనిలేకుండానే విమానయానం!.. ‘డిజి యాత్ర’కు విమానయానశాఖ సన్నాహాలు
విమాన ప్రయాణమనగానే బోల్డంత తతంగమనే భావన చాలామందిలో ఉంటుంది. టికెట్ల నుంచి బోర్డింగ్ పాస్ వరకు అన్నీ చేతిలో జాగ్రత్తగా పట్టుకోవాల్సిందే. వాటిలో ఏ ఒక్కటి పోయినా ఇక అంతే సంగతులు. ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా, అసలు కాగితంతో పనిలేకుండానే విమానప్రయాణాన్ని ఆస్వాదించేందుకు పౌర విమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది. విమానయానం మొత్తాన్ని డిజిటలైజ్ చేసే పనిలో పడింది. ఇందులో భాగంగా ‘డిజియాత్ర’కు రూపకల్పన చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా శుక్రవారం తెలిపారు.
డిజి యాత్రలో అసలు కాగితంలో పనే ఉండదు. ఆధార్ నంబరు, లేదంటే ఇతర ధ్రువపత్రాల ద్వారా ప్రయాణికుడిని గుర్తిస్తారు. టికెట్ నుంచి బోర్డింగ్ పాస్ వరకు అన్నీ డిజిటలైజ్ చేస్తారు. కాబట్టి మొబైల్ ఫోన్ సాయంతోనే డిజిటల్ బోర్డింగ్ పాస్‌ను పరిశీలిస్తారు. మరికొన్ని నెలల్లోనే డిజి యాత్ర కార్యరూపం దాల్చే అవకాశం ఉందని విమానయాన శాఖ అధికారులు చెబుతున్నారు.